భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా మూడ్రోజుల విదేశీ పర్యటన నిమిత్తం రష్యా, ఆస్ట్రియా వెళ్లిన సంగతి తెలిసిందే. సోమ, మంగళవారాల్లో ఆయన రష్యాలో పర్యటించారు. ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ మోదీకి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా మోదీ పుతిన్‌తో జరిగిన చర్చలు చరిత్రాత్మకమని రష్యా పేర్కొంది. ఈ పర్యటనను గేమ్ ఛేంజర్‌గా అభివర్ణించింది.
ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా రష్యా సైన్యంలో సహాయకులుగా ఉన్న భారతీయులను వెనక్కి రప్పించడంతోపాటు పలు కీలకాంశాలపై పుతిన్, మోదీ ప్రధానంగా దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని భారత్‌లోని రష్యా రాయబార కార్యాలయం వెల్లడించింది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఘర్షణ పరిస్థితులున్న నేపథ్యంలో మాస్కోలో పర్యటించి, పుతిన్‌తో వార్షిక శిఖరాగ్ర చర్చలు జరపడం గొప్ప విషయమని పేర్కొంది. మోదీ పర్యటనను యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా గమనించిందని భారత్‌లోని రష్యా దౌత్యవేత్త రోమన్ బబుష్కిన్ అన్నారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య విస్తరణ, స్థానిక కరెన్సీలో చెల్లింపులపై ఇరువురు నేతలు ప్రధానంగా చర్చలు జరిపారని తెలిపారు.