ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడయిన గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ హత్యకు గురయ్యాడు. అమెరికాలో కొందరు దుండగులు గోల్డీని కాల్చి చంపారు. అమెరికాలోని హోల్ట్ అవెన్యూలో మంగళవారం సాయంత్రం 5.25 గంటలకు గోల్డీ మరణించినట్లు స్థానిక మీడియా తెలిపింది. తన స్నేహితుడితో కలిసి ఇంటి బయట నిలబడి ఉన్న సమయంలో అతడిని గుర్తు తెలియని దుండగలు కాల్చి చంపి పారిపోయినట్లు పేర్కొంది.
అయితే దీనిపై పోలీసులు మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరపగా ఓ వ్యక్తి మరణించినట్లు పోలీసులు ధ్రువీకరించారు కానీ చనిపోయిన వారిలో గోల్డీ ఉన్న విషయాన్ని ధ్రువీకరించలేదు. గోల్డీ బ్రార్ ప్రత్యర్థులైన ఆర్ష్ దల్లా, లఖ్బీర్ లండా ఈ హత్యకు కారణమని సమాచారం. మరోవైపు ఈ హత్యపై గోల్డీ బ్రార్కు సంబంధించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సైతం ఎలాంటి ప్రకటన చేయలేదు.
గోల్డీ బ్రార్ అసలు పేరు సతీందర్ సింగ్. తొలిసారిగా సిద్ధూ మూసేవాలా హత్య కేసు దర్యాప్తులో ఇతడి పేరు వెలుగులోకి వచ్చింది. మూసేవాలా హత్య కేసులో అరెస్టయిన సూత్రధారి లారెన్స్ బిష్ణోయ్‌తో ఇతడికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ హత్య గురించి గోల్డీ బ్రార్‌కు ముందే తెలుసని పోలీసుల దర్యాప్తులో తేలింది.