హమాస్‌తో భీకర యుద్ధం జరుగుతున్న వేళ ఇజ్రాయెల్ సైనిక దళాలను ఉద్దేశించి ఆ దేశ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అక్టోబరు ఏడున హమాస్ దాడిని గుర్తించడంలో తమ ఇంటెలిజెన్స్‌వ్యవస్థ విఫలమైందని, భద్రతాధికారులు కూడా దాడి గురించి ఎలాంటి ముందస్తు హెచ్చరికలు జారీ చేయలేదని నెతన్యాహూ సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా పేర్కొన్నారు. దీనిపై కేబినెట్ సహచరులు, రాజకీయ వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో భద్రతా బలగాలపై నింద మోపుతూ ప్రధాని బాధ్యతారాహిత్యంగా వ్యవరిస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రక్షణ దళాలకు మద్దుతుగా.. ఉండాల్సిన సమయంలో, సైనిక బలగాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా.. వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని తెలిపాయి. సర్వత్రా విమర్శలు రావడంతోతన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన నెతన్యాహు తర్వాత తాను చేసిన ట్వీట్‌ను తొలగించారు. భద్రతా బలగాలకు క్షమాపణలు చెబుతున్నట్లు పేర్కొన్న ఆయన… వారికి తన పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.