“కథ ఇంకా ముగిసిపోలేదు.. ఇప్పుడే మొదలైంది.. జాగ్రత్తగా ఉండండి”.. అంటూ తమ దేశంపై దాడికి పాల్పడిన లెబనాన్‌లోని హెజ్‌బొల్లా గ్రూప్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ వార్నింగ్ ఇచ్చారు. హెజ్‌బొల్లా స్థావరాలు లక్ష్యంగా దాడులు కొనసాగుతాయని తెలిపారు. ఎవరూ ఊహించని విధంగా హెజ్‌బొల్లాపై ప్రతి దాడులు చేశామని.. వారి ఆగడాలను అణిచివేశామని వెల్లడించారు. ఉత్తర ప్రాంతంలోని ప్రజలను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు చర్యలు చేపట్టామని వివరించారు. గలిలీ ప్రాంతంలోని ప్రజలే లక్ష్యంగా హెజ్‌బొల్లా ప్రయోగించిన షార్ట్ రేంజ్ రాకెట్లను విజయవంతంగా కూల్చివేసినట్లు నెతన్యాహు తెలిపారు. సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని హెజ్‌బొల్లా ప్రయోగించిన రాకెట్లను అడ్డుకున్నట్లు ఐడీఎఫ్ తెలిపింది.
ఇజ్రాయెల్- హెజ్‌బొల్లా మధ్య గత కొంతకాలంగా ఘర్షణ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. అయితే అది ఆదివారం ఒక్కసారిగా తారస్థాయికి చేరిపోయింది. దాదాపు 300 కత్యూషా రాకెట్లతో హెజ్‌బెల్లా ఇజ్రాయెల్‌పైకి దాడికి తెగబడింది. మరో 6 వేల నుంచి 8 వేల రాకెట్లను ప్రయోగానికి సిద్ధంగా ఉంచింది. అప్రమత్తమైన ఇజ్రాయెల్ 100కి పైగా ఫైటర్ జెట్లను రంగంలోకి దింపి ఎదురుదాడికి దిగింది.