ప్రపంచ వ్యాప్తంగా విలయం సృష్టించిన కరోనా మహమ్మారి ఇంకా పూర్తిగా సమసిపోలేదు. రోజుకో కొత్త వేరియంట్ రూపంలో ప్రజలను భయపెడుతూనే ఉంది. ఈ వైరస్ పూర్తిగా సమసిపోకముందే మరో కొత్త రకం వైరస్ బయటపడటం ఇప్పుడు ప్రపంచాన్ని మరోసారి కలవరానికి గురి చేస్తోంది. గబ్బిలాల నుంచే కరోనా మహమ్మారి వచ్చిందన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే తాజాగా గబ్బిలాల నుంచే మరో కొత్తం రకం మహమ్మారి పుట్టుకొచ్చినట్లు న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న ఎకోహెల్త్ అలయన్స్ అనే పరిశోధనా సంస్థ తెలిపింది. గబ్బిలాల నుంచి మానవులకు సోకే ప్రమాదం ఉన్న ఈ కొత్త వైరస్‌ను థాయ్‌లాండ్‌లో గుర్తించారు. దీన్ని ఇంతకు ముందెప్పుడూ చూడలేదని ఇటీవల జరిగిన ప్రపంచ ఆరోగ్య సంస్థ సమావేశంలో శాస్త్రవేత్త డాక్టర్ పీటర్ దస్జాక్ తెలిపారు. కరోనా స్థాయిలో వ్యాపించే సామర్థ్యం తాజాగా గుర్తించిన కొత్త వైరస్‌కూ ఉందని వెల్లడించారు. థాయ్‌లాండ్‌లో ఓ గుహలోని గబ్బిలాల్లో దీన్ని గుర్తించినట్లు చెప్పారు. స్థానిక రైతులు ఈ గుహ నుంచి గబ్బిలాల ఎరువును పంట పొలాల్లో ఉపయోగిస్తున్నారని.. ఎరువులోనే ఆ వైరస్ ఉన్నట్లు తెలిపారు.