శివసేనలో చేరిన కేంద్ర మాజీ మంత్రి మిలింద్‌ దేవ్‌రా

-

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభం రోజే ఆ పార్టీకి కీలక నేత గుడ్ బై చెప్పారు. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్‌ నేత మిలింద్‌ దేవ్‌రా హస్తం పార్టీని వీడుతున్నట్లు ఆదివారం రోజున సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. అదే రోజు సాయంత్రం ఆయన శివసేన పార్టీలో చేరారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నివాసమైన వర్షాలో మిలింద్‌ దేవ్‌రా శివసేన కండువా కప్పుకున్నారు.

1968, 2004 నాటితో పోలిస్తే ప్రస్తుతం కాంగ్రెస్ చాలా భిన్నంగా ఉందని మిలింద్‌ దేవ్‌రా అన్నారు. కాంగ్రెస్, ఉద్ధవ్‌ ఠాక్రేలు నిర్మాణాత్మక, సానుకూల సూచనలు, సామర్థ్యాలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి ఉంటే ఏక్‌నాథ్ శిందే, తాను ఇవాళ ఇక్కడ ఉండేవాళ్లం కాదని చెప్పారు. దేశాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై నిర్మాణాత్మక సూచనలు అందించిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడాలనే ఒకే ఒక్క లక్ష్యాన్ని పెట్టుకుందని మండిపడ్డారు. మోదీ ఒకవేళ కాంగ్రెస్ మంచి పార్టీ అని చెబితే హస్తం నాయకులు ఆ మాటలను కూడా వ్యతిరేకిస్తారని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news