మధ్య నైజీరియాలోని సాయుధ మూకలు నరమేధం సృష్టించాయి. విచక్షణారహితంగా ప్రజలపై జరిపిన వరుస కాల్పుల్లో 160మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు స్థానిక ప్రభుత్వం ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘బండిట్స్’గా పిలిచే సైనిక గుంపులు కొన్ని తెగలకు చెందిన ప్రజలే లక్ష్యంగా గ్రామాలపై కాల్పులకు తెగబడ్డాయని ప్రకటనలో పేర్కొంది. అంతే కాకుండా ప్రజల ఇళ్లలోకి చొరబడి వారిని చిత్రహింసలు పెట్టాయని తెలిపింది.
ఆదివారం సాయంత్రం మధ్య నైజీరియాలోని పలుగ్రామాల్లో జరిగిన కాల్పుల్లో మొదట 16 మంది మృతి చెందినట్లు వార్తలు రాగా ఈ మారణకాండ సోమవారం కూడా కొనసాగడం వల్ల మృతి చెందిన వారి సంఖ్య భారీగా పెరిగింది. 160 మంది దుర్మరణం చెందగా మరో 300 మందికిపైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారని ప్రభుత్వ అధికారులు తెలిపారు. కొన్నేళ్లుగా నైజీరియాలోని ఈ ప్రాంతాల్లో మతపరమైన, సామాజిక పరమైన విబేధాల వల్ల ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా సాయుధ మూకలు కాల్పులకు తెగబడినట్లు సమాచారం. 2009 నుంచి ఇప్పటి వరకు పలుమార్లు ఇలాంటి ఘటనలు జరగ్గా వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.