బ్రిటన్ ప్రధాన మంత్రిగా రిషి సునాక్ బాధ్యతలు చేపట్టినప్పుటి నుంచి తరచూ ఏదో ఒక వివాదం ఆయణ్ను చుట్టుముడుతోంది. దాదాపుగా ఆయన సొంత పార్టీ నుంచే ఆయనకు ఎక్కువగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అయితే వచ్చే ఏడాది బ్రిటన్‌లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో రిషి సునాక్‌కు మరో సవాల్ సొంత పార్టీ నుంచి ఎదురైంది. ఆయనకు వ్యతిరేకంగా తన సొంత పార్టీ అయిన కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ ఆండ్రియా జెన్‌కిన్స్.. హౌస్ ఆఫ్ కామన్స్ వ్యవహారాలను చూసే 1922 కమిటీ ఛైర్మన్ గ్రాహమ్ బ్రాడీకి అవిశ్వాస లేఖ రాశారు.
సునాక్‌ను పదవి నుంచి దింపి.. ఆయన స్థానంలో నిజమైన కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునే సమయం వచ్చిందని ఆమె లేఖలో పేర్కొన్నారు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు నమ్మిన వ్యక్తిగా పేరు ఉన్న ఆండ్రియా.. కేబినెట్ నుంచి సువెల్లా బ్రేవర్మన్‌ను తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె ఈ అవిశ్వాస లేఖను సమర్పించినట్లు తెలిసింది. సునాక్ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఆయనపై అవిశ్వాస లేఖ రావడం ఇదే తొలిసారి. దీనిపై ఇప్పుడే ఆయన అవిశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని సమాచారం.