ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్న పాకిస్థాన్ ఈదుల్ అధా (బక్రీద్) పండగ సందర్భంగా ఆ దేశ ప్రజలకు తీపి కబురు చెప్పింది. ఓవైపు నగదు కొరత, రెండంకెల ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్నా ప్రజానీకానికి ఊరటనిస్తూ అక్కడి ప్రభుత్వం లీటరు పెట్రోలుపై రూ.10.20, హైస్పీడ్ డీజిలు (హెచ్‌ఎస్‌డీ)పై రూ.2.33 మేర తగ్గించింది.
బక్రీద్ పండుగ పురస్కరించుకుని శనివారం రోజు నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయంతో పెట్రోలు లీటరు ధర రూ.258.16, హెచ్‌ఎస్‌డీ రూ.267.89గా ఉంటుందని ట్రిబ్యూన్ వార్తా పత్రిక ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి వెలువడిన ప్రకటనను ఉటంకిస్తూ పేర్కొంది. 2022 మే నుంచి పాకిస్థాన్ ద్రవ్యోల్బణం 20 శాతానికి పైగా ఉంది. పరిశ్రమల విద్యుత్తు ఛార్జీలను యూనిట్‌కు రూ.10.69 చొప్పున తగ్గిస్తున్నట్లు ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే.