పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఎన్నిక ఇవాళ జరగనుంది. పాక్ ముస్లింలీగ్ – నవాజ్ (పీఎంఎల్ – ఎన్) పార్టీ అగ్రనేత షెహబాజ్ షరీఫ్ (72) దేశ 33వ ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. పీఎంఎల్-ఎన్, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)ల తరఫున ప్రధాని పదవికి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్న షెహబాజ్ ఇప్పటికే తన నామినేషను పత్రాలను సమర్పించారు. మరోవైపు షెహబాజ్‌కు పోటీగా మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు చెందిన పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ నుంచి ఒమర్ అయూబ్‌ఖాన్ నామినేషను వేశారు.
ప్రధాని ఎన్నికకు జాతీయ అసెంబ్లీలో ఈరోజు ఓటింగ్ నిర్వహించనున్నారు. విజేతగా నిలిచిన అభ్యర్థి ప్రధాన మంత్రిగా సోమవారం రోజున అధ్యక్ష భవనంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. మరోవైపు బలూచిస్థాన్ ప్రావిన్సు ముఖ్యమంత్రిగా పీపీపీ అభ్యర్థి సర్ఫరాజ్ బగ్టీ శనివారం ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మద్దతు కలిగిన సున్నీ ఇత్తేహాద్ కౌన్సిలు మార్చి 9వ తేదీన జరగనున్న అధ్యక్ష పదవి ఎన్నికల్లో తమ అభ్యర్థిగా పష్తున్‌ఖ్వా మిల్లి అవామీ పార్టీ అధినేత మహమూద్‌ఖాన్ అచక్‌జాయ్ (75)ను శనివారం నామినేట్ చేసింది.