బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తికి అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీ వైద్యులు.. జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీని విజయవంతంగా ట్రాన్స్‌ప్లాంట్ చేశారు. గత నెలరోజులుగా ఆ అవయవం చక్కగా పనిచేస్తోందని.. తమ పరిశోధన మంచి ఫలితాలు ఇవ్వడం పట్ల వైద్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిశోధనతో మానవుల అవయవాల కొరతను అధిగమించడానికి చేస్తున్న కృషిలో కీలక పురోగతిని సాధించినట్లు వైద్యులు తెలిపారు. అయితే గతంలోనూ వైద్యులు ఇలాంటి ప్రయత్నం చేశారట. కానీ ఆప్పుడు పంది కిడ్నీ రెండు రోజులకు మించి పనిచేయలేదట.
ఇప్పుడు ఏకంగా నెల రోజులుగా పనిచేయడం అద్భుతమేనని న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన ట్రాన్స్‌ప్లాంట్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ రాబర్ట్ మాంట్గోమెరి తెలిపారు. మనుషులకు జంతువుల అవయవాలను అమర్చడంలో ఇదో ముందడుగని నిపుణులు అభివర్ణించారు. ట్రాన్స్‌ప్లాంట్ చేసిన అవయవం ఎలా పనిచేస్తుందో రెండో నెలలోనూ పరిశీలిస్తామని డాక్టర్ రాబర్ట్ వెల్లడించారు. బ్రెయిన్‌డెడ్ అయిన 57 ఏళ్ల వ్యక్తి శరీరాన్ని ఆయన కుటుంబ సభ్యులను ఒప్పించి ఈ ప్రయోగానికి ఎంచుకున్నట్లు తెలిపారు.