UAEలో అతిపెద్ద హిందూ ఆలయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ.. వీడియో వైరల్

-

పశ్చిమాసియాలోనే అతిపెద్ద హిందూ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్​లో ప్రారంభించారు. బాప్స్ ఆధ్యాత్మిక గురువు మహంత్ స్వామి మహారాజ్​తో కలిసి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న బాప్స్ ఆలయాల్లో జరిగిన గ్లోబల్ హారతిలో పాల్గొన్నారు. గర్భాలయంలోకి వెళ్లిన మోదీ మోకరిల్లి భగవంతుడికి నమస్కరించారు. ఆలయమంతా తిరిగి పరిశీలించారు.

అంతకుముందు ఆలయ ప్రాంగణానికి వెళ్లిన ప్రధాని మోదీకి పలువురు సాధువులు స్వాగతం పలికారు. అక్కడికి చేరుకున్న ప్రవాస భారతీయులకు మోదీ అభివాదం చేస్తూ మందిర ప్రాంగణానికి చేరుకున్నారు. మోదీ మెడలో పూలదండ వేసిన ఈశ్వరచరందాస్ స్వామి ప్రధానిని ఆశీర్వదించారు. అనంతరం ఆలయ విశేషాలను వివరించారు. ఈ ఆలయ ప్రారంభోత్సవానికి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కూడా హాజరయ్యారు.

అబుదాబిలో బోచసన్వాసి అక్షర పురుషోత్తం స్వామినారాయణ సంస్థ నిర్మించిన ఈ హిందూ దేవాలయం అర‌బ్‌దేశాల్లో అతిపెద్ద ఆల‌యంగా పేరు సంపాదించుకుంది. దాదాపు రూ.700 కోట్ల వ్యయంతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ హిందూ దేవాలయానికి ఉన్న ఏడు గోపురాలు అరబ్‌ ఎమిరేట్స్‌లోని ఏడు ఎమిరేట్‌లకు ప్రతీక.

Read more RELATED
Recommended to you

Exit mobile version