వచ్చే ఏడాది రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ దేశంలో ఓ కీలక సంఘటన చోటుచేసుకుంది. ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విధానాలను తీవ్ర స్థాయిలో విమర్శించే నాయకుడు అలెక్సీ నవానీ జైలు నుంచి అదృశ్యమవ్వడం ఇప్పుడు అక్కడ కలవరం కలిగిస్తోంది. వచ్చే ఏడాది రష్యాలో అధ్యక్ష ఎన్నికలు జరిపేందుకు రంగం సిద్ధమైన తరుణంలో ఈ పరిణామం వెలుగులోకి రావడం గమనార్హం.
రష్యాలో అవినీతి వ్యతిరేక ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, విపక్ష నేత అలెక్సీ నవానీకి ఫౌండేషన్ కార్యకలాపాల విషయంలో నమోదైన కేసులో స్థానిక కోర్టు ఈ ఆగస్టులో 19 ఏళ్ల జైలు శిక్ష విధించింది. తర్వాత ఆయన్ను రష్యా రాజధాని మాస్కోకు 150 మైళ్ల దూరంలో ఉన్న పీనల్ కాలనీ(జైలు)లో ఉంచినట్లు సమాచారం. అయితే నవానీని సంప్రదించాలని ప్రయత్నించగా తమకు పీనల్ కాలనీ నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు. ఆరు రోజులుగా ఆయన ఆచూకీ తెలియడం లేదంటూ నెట్టింట పోస్టు పెట్టారు. ఇటీవల ఆయణ్ను కలిసినప్పుడు నవానీ అనారోగ్యంగా ఉన్నారని.. ఇప్పుడేమే ఏకంగా అదృశ్యమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు.