రష్యా స్పేస్ మాడ్యూల్ లూనా-25 చంద్రుడిపై కూలిన విషయం తెలిసిందే. ఆ ప్రయోగం విఫలం కావడానికి గల కారణాలను రష్యా అంతరిక్ష సంస్థ రాస్కాస్మోస్ తాజాగా వెల్లడించింది. నిర్దేశిత సమయంలో ఆ మాడ్యూల్లోని ఇంజిన్లు ఆఫ్ కాలేదని ఆ ఏజెన్సీ అధిపతి యూరి బోరిసోవ్ తెలిపారు. దానివల్ల లూనా-25 అనుకున్న కక్ష్యను దాటి మరో కక్ష్యలోకి వెళ్లినట్లు చెప్పారు.
ముందుగా అనుకున్నట్లు 84 సెక్లనలో ఇంజిన్ ఆఫ్ కావాలని, కానీ ఆ ప్రక్రియ జరిగేందుకు 127 సెకన్లు పట్టిందని, దాంతో లూనా-25 కూలి పోవాల్సి వచ్చిందని బోరిసోవ్ వెల్లడించారు. ఈ ఘటనపై మరింత లోతుగా విచారణ చేపట్టేందుకు ప్రత్యేక కమీషన్ ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రొపల్షన్ సిస్టమ్లో మిషన్ ఆపరేషన్ సరిగా జరగకపోవడం వల్ల .. లూనార్ ఆర్బిట్ నుంచి వ్యోమనౌక ముందుకు వెళ్లిందని, దాని వల్ల అది చంద్రుడిపై కూలిందని ఆయన వివరించారు.
మిషన్ విఫలమైనా, తమ స్పేస్ ఇంజినీర్లు విలువైన అనుభవాన్ని గ్రహించారని బోరిసోవ్ తెలిపారు. ఈ మిషన్లో జరిగిన పొరపాట్లను అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. లూనా-26, 27, 28 మిషన్లు భవిష్యత్తులో సక్సెస్ అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.