బాలీవుడ్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తాజాగా తెరకెక్కిస్తున్న సినిమా ‘ది వ్యాక్సిన్ వార్’ . వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న ఈ సినిమా గురించి వివేక్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇదే ఇంటర్వ్యూలో మరోసారి బాలీవుడ్ పైన వివేక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రేక్షకులకు కొన్ని వాస్తవాలను సినిమాల రూపంలోనే చూపించాలని.. సంప్రదాయాలను, కొత్తదనాన్ని చూపించే సినిమాలు తీయాలని.. అలాంటి వాటికోసం మేము సంపాదించిన డబ్బును ఉపయోగించాలని తాను, తన భార్య నిర్ణయించుకున్నామని వివేక్ తెలిపారు. అందుకే ‘ది కాశ్మీర్ ఫైల్స్’ తీశామని.. ఆ డబ్బు మొత్తంతో ఇప్పుడు ‘ది వ్యాక్సిన్ వార్’ను తెరకెక్కిస్తున్నామని తెలిపారు.
“కరోనా సమయంలో ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన వ్యాక్సిన్‌ను భారత్ తయారుచేసింది. ఈ వ్యాక్సిన్‌ను తయారుచేయడంలో మహిళా శాస్త్రవేత్తల పాత్ర కూడా ఉంది. వాళ్ల మీద నేను సినిమా తీస్తున్నాను. మేము సంపాదించిన డబ్బుతో పాటు రెండు సంవత్సరాల కాలాన్ని కూడా పెట్టుబడిగా పెట్టాం’’ అని వివేక్ అగ్నిహోత్రి చెప్పారు. ఇక ‘ది వ్యాక్సిన్ వార్’లో నానా పటేకర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. హిందీతో పాటు మరో 10 భాషల్లో సెప్టెంబర్ 28న విడుదల కానుంది.