రష్యాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మిలిటరీ రవాణా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని 15 మంది దుర్మరణం పాలయ్యారు. ఇల్ – 76 మిలిటరీ కార్గో విమానం మంగళవారం రోజున పశ్చిమ రష్యాలోని ఎయిర్ బేస్ నుంచి 15 మందితో టేకాఫ్ అయ్యింది. కాసేపటికే విమానంలోని ఓ ఇంజిన్‌లో మంటలు చెలరేగడం వల్ల ఇవానోవో ప్రాంతంలో కూలినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ప్రమాద సమయంలో అందులో 8 మంది సిబ్బంది, ఏడుగురు ప్రయాణికులు ఉన్నట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. విమానంలో ఉన్న వారి పరిస్థితి గురించి అధికారులు చెప్పనప్పటికీ, వారెవరూ సురక్షితంగా లేరని రష్యా ఆన్‌లైన్ మీడియా కథనాలు వెల్లడించాయి. ఘటన జరిగిన సమయంలో విమానంలో మంటలు చెలరేగి ఓ వైపు ఒరిగి కిందకు పడిపోతున్నట్టు కనిపించినట్లు సమాచారం . ప్రమాద సమయంలో పెద్ద ఎత్తున పొగలు చెలరేగాయి.