త్వరలో తుర్కియేకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌

-

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ త్వరలో తుర్కియేలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని తుర్కియే విదేశాంగ మంత్రి హకాన్‌ ఫిదాన్‌ తెలిపారు. తమ అధ్యక్షుడు ఎర్డోగాన్‌తో పుతిన్ సమావేశమవుతారని చెప్పారు. ఈ భేటీలో నల్ల సముద్రం మీదుగా ఉక్రెయిన్‌ ఆహార ధాన్యాల ఎగుమతులకు కొత్త మార్గాలపై చర్చించే అవకాశం ఉందని మంత్రి ఫిదాన్‌ వెల్లడించారు. ఒకవేళ నిజంగానే పుతిన్ తుర్కియే వెళ్తే.. ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రారంభించిన తర్వాత ఓ ‘నాటో’ సభ్యదేశానికి పుతిన్ వెళ్లడం ఇదే తొలిసారి అవుతుంది. అయితే పుతిన్ పర్యటన తేదీని మాత్రం ఫిదాన్ వెల్లడించలేదు. ఫిబ్రవరి 12వ తేదీన వచ్చే అవకాశముందని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఉక్రెయిన్‌లోని ఆక్రమిత ప్రాంతాల నుంచి తన దేశానికి పిల్లలను చట్టవిరుద్ధంగా తరలించడం వంటి యుద్ధ నేరాలకు బాధ్యుడిగా పేర్కొంటూ పుతిన్‌పై అంతర్జాతీయ న్యాయస్థానం గతేడాది అరెస్టు వారెంట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐసీసీలో సభ్యత్వం ఉన్న దేశాల్లో ఆయన కనిపిస్తే అరెస్టు చేయాల్సి ఉంటుంది. రష్యా మాదిరే తుర్కియే కూడా ఇందులో చేరలేదు. ఈ నేపథ్యలో పుతిన్ ఆ దేశంలో పర్యటించనున్నట్లు వార్తలొస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news