వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాదు.. అమెరికా మాజీ అధ్యక్షుడు అప్పుడప్పు కాస్త తింగరగా ప్రవరిస్తూ వార్తల్లోకి ఎక్కుతారు. తాజాగా ఆయన చేసిన ఓ పని చూసి నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. తాజాగా ఓ వ్యవహారంలో ట్రంప్ తీవ్ర విమర్శలపాలు అవుతున్నారు. అధికారిక రహస్యాల దస్త్రాలను తన ఇంట్లో దాచారన్న కేసులో అభియోగాలున్న ట్రంప్ గత మంగళవారం మియామీలోని ఫెడరల్ కోర్టుకు హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో స్థానిక క్యూబన్ రెస్టారెంటును సందర్శించారు. మాజీ అధ్యక్షుడు రావడంతో అక్కడున్నవారు ఆనందంతో కేరింతలు కొట్టారు.
ఆయనతో చేతులు కలుపుతూ.. పాటలతో ముందస్తుగా పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఈ క్రమంలోనే ‘‘మీకందరికీ ఆహారం ఉచితం.. ఎంతైనా తినండి.. నేను బిల్లు కడతాను’’ అంటూ ట్రంప్ గట్టిగా అరిచి మరీ ప్రకటించారు. దీంతో తాము తిన్నదానికి ట్రంప్ బిల్లు చెల్లిస్తారని అక్కడివారంతా మరింత సంబురపడ్డారు. కొద్దిసేపు అక్కడే గడిపిన ట్రంప్ చివరకు ఏ బిల్లూ కట్టకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అప్పటిదాకా హుషారుగా ఉన్న అందరూ ఈ విషయం తెలిసి విస్తుపోయారు. మాజీ అధ్యక్షుడి వైఖరిపై సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి.