అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడే కొద్దీ డొనాల్డ్ ట్రంప్ విమర్శలు పదునెక్కుతున్నాయి. తాజాగా ఆయన అధ్యక్షుడు జోబైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను లక్ష్యంగా చేసుకొని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమలా హ్యారిస్ను జోబైడెన్‌కు బీమా పాలసీగా ట్రంప్ అభివర్ణించారు.
‘‘వంకర బుద్ధి జోబైడెన్‌ను ఓ విషయంలో మెచ్చుకోవచ్చు. కమలా హ్యారిస్‌ను తన ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసుకోవడం అతడు జీవితంలో తీసుకొన్న అద్భుతమైన నిర్ణయం. అదే అతడికి బెస్ట్ ఇన్స్యూరెన్స్ పాలసీ కావచ్చు. కనీసం సగం సమర్థుడినైనా ఎంపిక చేసుకొని ఉంటే.. కొన్నేళ్లక్రితమే బైడెన్‌ను వారు ఆఫీస్ నుంచి సాగనంపేవారు. కానీ, ఇప్పుడు కమలా ఆ స్థానంలో ఉండటంతో ఇక ఎవరూ పంపలేరు’’ అంటూ డొనాల్డ్ ట్రంప్ ఎద్దేవా చేశారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు ప్రభుత్వంలో రెండు కీలక అంశాలైన బోర్డర్ సెక్యూరిటీ, ఉక్రెయిన్‌పై దాడి చేయకుండా రష్యాను భయపెట్టి ఆపడం వంటి బాధ్యతలు ఇచ్చారని ట్రంప్ పేర్కొన్నారు. ఇక సరిహద్దు రక్షణ బాధ్యతలు చేపట్టాక ఆమె చేసిందేమీ లేదన్నారు.