వచ్చే ఏడాది అమెరికాలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పోటీ పడుతున్న అభ్యర్థులు ప్రచారం షురూ చేశారు. ముఖ్యంగా వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ, డొనాల్డ్ ట్రంప్ తమ ప్రసంగాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున నామినేషన్‌కు పోటీ పడుతున్న భారతీయ అమెరికన్ నేత నిక్కీ హేలీ సొంత రాష్ట్రమైన దక్షిణ కరోలినాలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది. సీఎన్‌ఎన్ తాజాగా నిర్వహించిన సర్వేలో 53% మంది తాము ట్రంప్‌నకు మద్దతిస్తున్నట్లు చెప్పారు. 22% మంది మాత్రం హేలీకి .. మరో భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామికి ఒక్కశాతం మందే మద్దతుగా నిలిచారు.
ప్రైమరీల ఎన్నికలు ముందుగా జరిగే రాష్ట్రాల్లో దక్షిణ కరోలినా కూడా ఉంది. అయితే ప్రస్తుత మద్దతుదారులు తాము తిరిగి ట్రంప్‌నకే మద్దతు ఇస్తామని 82% మంది చెప్పారు. హేలీ విషయంలో 42% మంది, డిశాంటిస్‌కు 38% మంది ఈ రీతిలో స్పందించినట్లు సీఎన్ఎన్ సర్వేలో తేలింది. అమెరికా మొత్తంమీద ఎవరికి ఎంత మద్దతు ఉందనే విషయంలో ‘రియల్ క్లియర్ పాలిటిక్స్’ అంచనాలు వేయగా.. రిపబ్లికన్లలో 59% మంది ట్రంప్ పక్షాన.. డిశాంటిస్ (12.6%), హేలీ (8.3%), రామస్వామి (4.6) ఉన్నట్లు తేలింది.