బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేసిన అనంతరం భారత్కు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆమె మొదట లండన్ వెళ్లాలనుకున్నారని.. అనివార్య కారణాల వల్ల వెళ్లలేకపోయారనే ప్రచారం జరిగింది. బ్రిటన్లో రాజకీయ శరణార్థిగా ఉండేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె యూకే ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె వినతిపై యూకే సర్కార్ స్పందించింది.
లండన్‌లో ఆశ్రయం పొందుతారన్న వార్తల నేపథ్యంలో బ్రిటన్ హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆశ్రయం కోరుతూ లేదా శరణార్థిగా ఒక వ్యక్తి తమ దేశం వచ్చేందుకు తమ వలస చట్టాలు అంగీకరించవని ఆయన వెల్లడించారు. అవసరంలో ఉన్న వ్యక్తులకు రక్షణ కల్పించే విషయంలో యూకేకు గర్వించదగ్గ రికార్డు ఉందని.. కానీ ఆశ్రయం కోరుతూ లేదా తాత్కాలిక శరణార్థిగా ఒక వ్యక్తి యూకే వచ్చేందుకు అనుమతించేలా నిబంధన ఏదీ లేదని ఆయన జాతీయ మీడియాతో అన్నారు. అంతర్జాతీయ రక్షణ కోరేవారు.. వారు తొలుత చేరుకున్న సురక్షిత దేశంలోనే ఆశ్రయం అడగాలని.. అదే వారి రక్షణకు అత్యంత వేగవంతమైన మార్గమని.. భారత్‌లోనే ఆశ్రయం పొందాలనే అర్థంలో ఆయన పరోక్షంగా వ్యాఖ్యానించారు.