నిన్న మొన్నటి దాక ఉక్రెయిన్ ను బెదరగొట్టిన రష్యా.. ఇప్పుడు ఆ దేశానికే భయపడుతోంది. ఉక్రెయిన్ చేస్తున్న వరుస డ్రోన్ దాడులతో రష్యా వణుకుతోంది. ఒకప్పుడు ఉక్రెయిన్ ను గడగడలాడించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పుడు నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున ఉక్రెయిన్ నుంచి దూసుకొచ్చిన డ్రోన్లు మాస్కో సిటీ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని రెండు బహుళ అంతస్తుల వాణిజ్య భవనాలపై విరుచుకుపడ్డాయి. ఈ పేలుళ్లు.. మాస్కో నగర ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాయి.
ఈ ఘటనతో వెంటనే ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌ను అధికారులు నిలిపివేశారు. వినుకోవా విమానాశ్రయాన్ని ఓ గంట పాటు తాత్కాలికంగా మూసివేశారు. నెల రోజుల్లో మాస్కోపై ఇది నాలుగో డ్రోన్ దాడి. ఈ వారంలోనే మూడోది కావడం గమనార్హం. ఈ దాడిని తామే చేశామని ఉక్రెయిన్ అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాత్రం ఇక యుద్ధం రష్యాలో జరగనుందంటూ ప్రకటించారు. మరోవైపు రష్యా క్షిపణి దాడులతో ఉక్రెయిన్‌లో ఇద్దరు పౌరులు చనిపోయారు. 20 మందికి గాయాలయ్యాయి.