ఇజ్రాయెల్‌ తీరుతో ప్రపంచ శాంతికి ముప్పు.. గుటెరస్‌ ఆందోళన

-

ఇజ్రాయెల్ హమాస్ల యుద్ధం పశ్చిమాసియాను వణికిస్తోంది. ఓవైపు ఇజ్రాయెల్ సైన్యం గాజాపై విరుచుకుపడుతుంటే మరోవైపు హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ సైన్యాన్ని మట్టుబెడుతున్నారు. అయితే స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటును ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు వ్యతిరేకించడాన్ని ప్రపంచ దేశాలు తప్పుబడుతున్నాయి. తాజాగా ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ కూడా ఇజ్రాయెల్ వైఖరిపై అసహనం వ్యక్తం చేశారు.

ఈ వైఖరి మారకపోతే ప్రపంచ శాంతికి ముప్పు కలగవచ్చని గుటెరస్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ వైఖరితో ఇరు దేశాల వివాదం సుదీర్ఘకాలం కొనసాగే ప్రమాదం ఉందని, చాలా చోట్ల తీవ్రవాద సంస్థలు పుట్టుకు రావొచ్చని హెచ్చరించారు. ఐరాస భద్రతా మండలి సమావేశంలో మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల ఏర్పాటు పరిష్కారాన్ని ఎవరు నిరాకరించినా ఆ నిర్ణయాన్ని తిరస్కరించాల్సిందేనని ఆయన పిలుపునిచ్చారు. ఎలాంటి స్వతంత్రం, హక్కులు, గౌరవం లేకుండా అంతమంది పాలస్తీనా ప్రజలు ఒక ప్రాంతంలో ఉండడం అసలు ఊహించలేమని గుటెరస్‌ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news