హమాస్ అంతమే లక్ష్యంగా ఇజ్రాయెల్ గాజాపై భీకర యుద్ధం సాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంతో వేల మంది పౌరులు మరణిస్తున్నారని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇరు దేశాలు చర్చలతో ఈ సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తున్నాయి. అయినా ఈ రెండు దేశాలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
అయితే తాజాగా గాజాలో 4 గంటలు యుద్ధానికి విరామం ఇచ్చేందుకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు అమెరికా ప్రకటించింది. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు వీలుగా.. యుద్ధానికి విరామం ప్రకటించాలన్న నిర్ణయం తాను అనుకున్న దాని కంటే ఆలస్యంగా జరిగిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. హమాస్ వద్ద ఉన్న బందీలను విడిపించేందుకు , మిలిటెంట్లతో చర్చలు జరపడానికి యుద్ధాన్ని 3 రోజులు ఆపాలని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును కోరినట్లు వెల్లడించారు.
గాజా ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు యుద్ధ విరామాన్ని ఇజ్రాయెల్ శుక్రవారం ప్రకటిస్తుందని అమెరికా ప్రకటించింది.ఇజ్రాయెల్ సైన్యం లక్ష్యంగా చేసుకున్న ప్రాంతాల నుంచి పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేందుకు వీలుగా రెండో కారిడార్‌ను తెరిచేందుకు ఆ దేశం అంగీకరించిందని తెలిపింది. మరోవైపు.. అమెరికా ప్రకటనను ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి కార్యాలయం ఖండించింది. హమాస్‌ను సమూలంగా నాశనం చేసే వరకు యుద్ధం ఆపేదే లేదని తేల్చి చెప్పింది.