హమాస్ దాడిలో ఇజ్రాయెల్ ఘోరంగా దెబ్బతినడం వాస్తవమేనని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. అయినా కూడా.. గాజాలోని ప్రజల కష్టాలు తీర్చేందుకు ఇజ్రాయెల్ తప్పకుండా మార్గాలు అన్వేషించాలని సూచించారు. ఇజ్రాయెల్‌కు సంఘీభావం తెలిపేందుకు బుధవారం టెల్ అవీవ్‌లో పర్యటించిన బైడెన్….ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు.
ఇజ్రాయెల్ పర్యటన ముగించుకొని అమెరికాకు తిరుగువెళ్తూ ఎయిర్‌ఫోర్స్-వన్ విమానంలో మీడియా ప్రతినిధులతో బైడెన్ మాట్లాడారు. హమాస్ దాడిలో ఇజ్రాయెల్ తీవ్రంగా నష్టపోయిన మాట్ వాస్తవం అన్నారు. అయితే గాజా నుంచి ఎటూ వెళ్లలేని అమాయక పౌరుల బాధను తీర్చే అవకాశం కనుక ఇజ్రాయెల్‌కు ఉంటే.. ఆ దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఒకవేళఅలా చేయలేకపోతే .ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయత కోల్పోవాల్సి ఉంటుందని బైడెన్ హెచ్చరించారు.
ఇక అంతకుముందు గాజాకు ఆర్థిక సాయం ప్రకటిస్తున్నట్లు బైడెన్ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రకటించారు. గాజాలో పరిస్థితులు చూసి చలించిపోయానని.. అక్కడి ప్రజలకు మానవతా సాయంగా రూ.832 కోట్ల సాయం ప్రకటిస్తున్నట్లు తెలిపారు. 10లక్షల మందికి పైగా ప్రజలకు, యుద్ధ ప్రభావిత పాలస్తీనియన్లకు తాము చేసిన సాయం ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా బైడెన్ ట్వీట్లో పేర్కొన్నారు.