రష్యాను ఒకరోజు గడగడలాడించిన వాగ్నర్ గ్రూపు ఎట్టకేలకు వెనక్కి తగ్గింది. దాదాపు అంతర్యుద్ధం అంచులవరకు వెళ్లి.. రాజీ ఒప్పందంతో రక్తపాతం లేకుండా ముగిసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ పెంచి పోషించిన కిరాయిసేన వాగ్నర్ గ్రూపు ఆయనపై తిరుగుబాటు జెండా ఎగురవేసింది. ఒక్కొక్క నగరాన్నీ దాటుకుంటూ మాస్కోకు దక్షిణంగా ఉన్న కీలక నగరం రొస్తోవ్-ఆన్-డాన్‌లోని రష్యా సైనిక కార్యాలయాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది.
ఈ అనూహ్య పరిణామంతో రష్యా అధినాయకత్వం అప్రమత్తమైంది. మాస్కోతోసహా ప్రధాన నగరాలు, దక్షిణ ప్రాంతాలైన రొస్తోవ్, లిపెట్స్క్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్‌పై రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ క్రిమినల్ కేసు పెట్టింది. ప్రైవేటు సైన్యం చేరకుండా ఉండేందుకు మాస్కోను అనుసంధానం చేసే మార్గాన్ని మూసివేసినట్లు స్థానిక గవర్నర్ తెలిపారు.
వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్‌తో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో చర్చలు జరిపి సంధి ప్రయత్నాలు చేశారు. ఉద్రిక్తతను సడలించడానికి బలగాలను నిలువరించాలని కోరారు. దీనికి తమ నేత అంగీకరించారని రష్యా 24 వార్తా ఛానల్ తెలిపింది. దీంతో వాగ్నర్ గ్రూపు సైన్యాన్ని ఉక్రెయిన్లోని తమ శిబిరాలకు వెళ్లిపోవాలని ఆదేశించినట్లు ప్రిగోజిన్ తెలిపారు. ఒప్పందంలో భాగంగా.. రష్యా ప్రభుత్వం ప్రిగోజిన్‌పై పెట్టిన క్రిమినల్ కేసు ఎత్తివేసినట్లు ప్రకటించింది.