రాష్ట్రపతి నామినేషన్‌కు ముందు.. PMO ఫోన్‌కాల్‌ను చూడని ద్రౌపదీ ముర్ము

-

రాష్ట్రపతి జీవిత చరిత్రపై జర్నలిస్ట్‌ కస్తూరి రే రాసిన ‘‘ద్రౌపదీ ముర్ము: మారుమూల గిరిజన ప్రాంతం నుంచి రైసినా హిల్స్‌ వరకు’’ పుస్తకంలో ముర్ము జీవితానికి సంబంధించి ఆసక్తికర విషయాలు ఉన్నాయి. రాష్ట్రపతి కాకముందు ముర్ము ఫోన్‌ను అంతగా వినియోగించేవారు కాదట! ఆమె జీవితంలో అతి ముఖ్యమైన ఫోన్‌ కాల్‌ను సైతం స్వీకరించలేదట. ఇంతకీ అదేంటంటే..?

ద్రౌపదీ ముర్మును ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేస్తూ.. ఆ విషయాన్ని తెలిపేందుకు ప్రధాని కార్యాలయం ఫోన్‌ చేయగా ఆమె గమనించలేదట. ‘‘2022 జూన్‌ 21న ద్రౌపదీ ముర్ము ఒడిశాలోని రాయ్‌రంగ్‌పుర్‌లో ఉన్నారు. బీజేపీ ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది. అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. టీవీ ఛానళ్లు ఈ వార్తను ప్రసారం చేస్తున్నాయి. స్థానికంగా విద్యుత్తు కోత కారణంగా ఆ సమయంలో ముర్ము, ఆమె కుటుంబ సభ్యులు టీవీలో ఈ వార్తలను చూడలేదు. పీఎంవో అధికారులు జార్ఖండ్‌లో ముర్ము వద్ద ప్రత్యేక అధికారిగా పనిచేసిన వికాస్‌ చంద్ర మొహంతోకు ఫోన్‌ చేశారు. ఆయన పరుగున ముర్ము ఇంటికి చేరుకుని.. మీతో మాట్లాడడానికి ప్రధాని కార్యాలయం నుంచి కాల్‌ వచ్చిందని ఫోన్‌ చేతికిచ్చారు. ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎంపిక చేశారని తెలుసుకుని, ఆమె నోట మాటలు రాలేదు. తర్వాత తేరుకొని అంతటి కీలకమైన బాధ్యతలు నిర్వహించగలనా? అని ఆమె ప్రధాని వద్ద సందేహం వెలిబుచ్చగా.. నిర్వహించగలరని మోదీ ధైర్యం చెప్పారు’’ అని పుస్తకం పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news