ప్రపంచాన్ని కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా జారీ చేసిన హెచ్చరిక ప్రజలను మరింత భయాందోళనకు గురి చేస్తోంది. కరోనా వైరస్ కట్టడికి ప్రపంచ దేశాలు కలసికట్టుగా యుద్ధం చేయకపోతే 20 లక్షల మంది ప్రాణాలు కోల్పోవచ్చునని డబ్ల్యూహెచ్‌వోహెచ్చరించింది. కరోనా వైరస్ చైనాలో వూహాన్‌లో ప్రబలిన తొమ్మిది నెలల్లోనే ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మందిని పొట్టనబెట్టుకున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్‌వో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వాలతో పాటు పౌరులు వ్యక్తిగత స్థాయిలో కరోనాను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌వో ఎమర్జెన్సీ డైరెక్టర్ మైకేల్ ర్యాన్ అన్నారు. కరోనా తగ్గుముఖం పడుతోందన్న సూచనలు ఎక్కడా లేవని అభిప్రాయపడ్డారు.
మరోపక్క భారత్‌లో కరోనా కేసుల సంఖ్య అరవై లక్షలకు చేరువు కాగా.. మరణాల సంఖ్య లక్షకు దగ్గరైంది. దేశంలో నిత్యం 85 నుంచి లక్ష లోపు కరోనా కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 88,951 కరోనా కేసులు నమోదయ్యాయి. నిత్యం కరోనా కారణంగా వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఆదివారం మధ్యాహ్నానికి భారత్‌లో కరోనా కేసుల సంఖ్య అరవై లక్షలు దాటనుంది.