ఆర్డర్ చేయకపోయినా.. ఓ మహిళకు వంద అమెజాన్ పార్శిళ్లు వచ్చాయి. అవి ఎక్కడ నుంచి వస్తున్నాయి? వాటిని ఏం చేయాలో తెలియక ఆ మహిళ సతమతమైంది. చివరకు వాటిని అందరికీ పంచేసింది. ఈ సంఘటన అమెరికాలోని వర్జీనియా రాష్ట్రంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే… ‘లిక్సియావో జాంగ్’ పేరిట ఉన్న పెట్టెలు ప్రిన్స్ విలియం కౌంటీలోని సిండీ స్మిత్ ఇంటికి వచ్చాయి. ఆ అమెజాన్ బాక్సుల్లో సుమారు వెయ్యి హెడ్‌ల్యాంప్స్, 800 గ్లూ గన్స్, డజన్ల కొద్దీ బైనాక్యులర్స్ వచ్చాయి. ఇలా సుమారు వందకు పైగా పార్శిళ్లు ఆమె ఇంటి తలుపుతట్టాయి. కేవలం అమెజాన్ మాత్రమే కాదు ఫెడ్‌ఎక్స్ నుంచి కూడా కొన్ని పార్శిళ్లు అందాయని సిండీ తెలిపారు. ఆ వస్తువులను ఏం చేయాలో పాలుపోక చివరకు వాటిని పంచేయాలని నిర్ణయం తీసుకున్నానని ఆమె తెలిపారు.
నకిలీ రేటింగ్‌లు, రివ్యూల కోసం విక్రేతలు ఇలా పంపిస్తుంటారని.. కానీ, ఆమె ‘వెండర్న్ రిటర్న్’ అనే పథకంలో బాధితురాలని కొందరు అంటున్నారు. అమెజాన్ కేంద్రాల్లో పోగుపడిన వస్తువులను వదిలించుకోవడానికి విక్రేతలు ఇలా చేస్తుంటారని మరికొందరు భావిస్తున్నారు. అయితే ఈ సంఘటనపై అమెజాన్ స్పందించింది. విక్రేత ఖాతా దుర్వినియోగమైనట్లు గుర్తించామంది. అందుకే ఆ ఖాతాను మూసివేస్తున్నామని ఒక ప్రకటనలో వెల్లడించింది.