వచ్చే ఐదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు పావు వంతు (23%) ఉద్యోగాల్లో మార్పులు తథ్యమని ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక స్పష్టం చేసింది. 2023 నుంచి 2027 వరకు దాదాపు 6.9 కోట్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని పేర్కొంది. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల్లో 8.3 కోట్లు కనుమరుగవుతాయని అంచనా వేసింది.
ఈ మేరకు భవిష్యత్ ఉద్యోగాల తీరుతెన్నులపై ‘ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2023’ పేరిట డబ్ల్యూఈఎఫ్ సవివర నివేదికను ఆదివారం విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 803 కంపెనీల్లో నిర్వహించిన సర్వే ద్వారా ఈ విషయాలను వెల్లడించింది.
హరిత ఇంధనంవైపు మళ్లడం; సరఫరా గొలుసుల స్థానికీకరణ; పర్యావరణ, సామాజిక, పాలనాపరమైన అంశాల్లో ప్రామాణికత ఉద్యోగాల సృష్టికి దోహదం చేస్తాయని ఈ నివేదిక స్పష్టం చేసింది. అదే సమయంలో ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధిలో మందకొడితనం, సరఫరా కొరతలు సవాల్ విసురుతాయని పేర్కొంది. మొత్తంగా అధునాతన సాంకేతికతల వల్ల దీర్ఘకాలంలో ఉద్యోగాల కల్పన మెరుగవుతుందని ఈ నివేదిక స్పష్టం చేసింది.