కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఆదివారం రోజున ఆయన మైసూర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ప్రధాని రోడ్ షో కార్యక్రమంలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..?
ప్రధాని మోదీ ఆదివారం మైసూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై రోడ్ షో నిర్వహించారు. ఆ సమయంలో బీజేపీ మహిళా కార్యకర్త ప్రధాని వైపుగా ఫోన్‌ను విసిరేశారు. అది వాహనం బానెట్‌పై పడింది. అంత ప్రచారంలోనూ మోదీ దానిని గమనించి స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ను అప్రమత్తం చేశారు.
‘ప్రధాని ఎస్పీజీ రక్షణలో ఉన్నారు. ఆ ఫోన్ విసిరిన మహిళ భాజపా కార్యకర్త. తర్వాత ఎస్పీజీ సిబ్బంది ఆ ఫోన్‌ను ఆమెకు అందించారు. అత్యుత్సాహంలో ఆమె దానిని విసిరారు. ఎలాంటి దురుద్దేశంతో ఆమె ఆ పని చేయలేదు. కానీ, మేం ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహిస్తున్నాం’ అని పోలీసు ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.