కోవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. భారత్‌లో కోవిడ్‌కు చెందిన రెండు వేరియెంట్లు ఉద్భవించిన సంగతి తెలిసిందే. వాటికి గ్రీకు అక్షరాలో పేర్లు పెట్టింది. భారత్‌లో కోవిడ్ బి.1.617.1, బి.1.617.2 వేరియెంట్లు ఉద్భవించగా వాటికి గ్రీకు అక్షరాలైన కప్పా, డెల్టాలుగా నామకరణం చేసింది.
భారత్ లో ఆయా కోవిడ్ వేరియెంట్లను ముందుగా గుర్తించినప్పటికీ వాటికి భారత కోవిడ్ వేరియెంట్లు అని పేరు పెట్టకూడదని కేంద్రం ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. అందులో భాగంగానే ఇండియన్ కోవిడ్ వేరియెంట్లు అనే పదాలను ఎవరూ వాడకూడదని తెలిపింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ వేరియెంట్లకు గ్రీకు అక్షరాలతో పేరు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
బి.1.617.1 వేరియెంట్‌కు కప్పా అని, బి.1.617.2 వేరియెంట్‌కు డెల్టా అని ప్రపంచ ఆరోగ్య సంస్థ నామకరణం చేసింది. అయినప్పటికీ వాటి సైంటిఫిక్ పేర్లు అలాగే ఉంటాయని, ప్రజలకు సులభంగా అర్థం కావడం కోసం వాటికి సాధారణ పేర్లను పెట్టామని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలియజేసింది. కాగా భారత్‌లో ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతోంది. రోజువారీగా నమోదవుతున్న కేసుల సంఖ్య తగ్గుతోంది. అయినప్పటికీ ఓవరాల్‌గా చూస్తే కరోనా ప్రభావం ఎక్కువగానే ఉంది. ఈ క్రమంలోనే త్వరలో రానున్న థర్డ్ వేవ్ పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.