ఉక్రెయిన్-రష్యాల యుద్ధం కీలకదశలో ఉంది. ఈ యుద్ధంలో తమ సైనికులు, ప్రజల ప్రాణాలు, పలు భూభాగాలను కోల్పోయిన ఉక్రెయిన్ ఇప్పుడిప్పుడే ఎదురుదాడికి దిగుతోంది. రష్యాపై భీకరయుద్ధాన్ని చేస్తోంది. రష్యాతో జరుగుతున్న యుద్ధంలో కీలకమైన ఎదురుదాడి సమయంలో ఉక్రెయిన్ తీసుకున్న ఓ నిర్ణయం ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది.
తాజాగా ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్‌ని పదవి నుంచి తొలగించారు ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. ‘‘రక్షణ మంత్రిత్వ శాఖ సరికొత్త విధానాన్ని అనుసరిస్తుందని.. సమాజం, సైన్యం ఒక్కటిగా కలిసి పనిచేస్తారని నేను నమ్ముతున్నాను’’ అని జెలెన్స్కీ పేర్కొన్నారు.
రష్యా యుద్ధం మొదలుపెట్టడానికి ముందు 2022లో రెజ్నికోవ్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తాజాగా రెజ్నికోవ్ స్థానంలో ఉక్రెయిన్ స్టేట్ ఫండ్‌ను నిర్వహిస్తున్న రెస్టెమ్ ఉమెరోవ్‌కు ఈ బాధ్యతలు అప్పగించారు. తాజాగా రెజ్నికోవ్ యూకేలో ఉక్రెయిన్ దౌత్యాధికారిగా బాధ్యతలు స్వీకరించవచ్చని ప్రచారం జరుగుతోంది. తనను పదవి నుంచి తప్పిస్తారని రెజ్నికోవ్‌కు ముందే సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది.