ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఘాటుగా స్పందించారు. పుతిన్‌తో మోదీ భేటీ తమను తీవ్రంగా నిరాశపరిచిందని వ్యాఖ్యానించారు. విదేశీ పర్యటనలో భాగంగా మోదీ సోమవారం రోజున రష్యా వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, మోదీకి ప్రత్యేకంగా ఆతిథ్యమిచ్చిన క్రమంలో ఇరు దేశాధినేతలు ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఫొటోలపై జెలెన్స్కీ తీవ్రంగా స్పందించారు.
‘ఉక్రెయిన్‌పై సోమవారం రష్యా జరిపిన క్షిపణి దాడిలో ముగ్గురు చిన్నారులతో సహా 37 మంది ప్రాణాలు కోల్పోయారు. 171 మంది గాయపడ్డారు. ఆ వెంటనే చిన్నారుల ఆస్పత్రిపై రష్యా మరో క్షిపణి దాడి చేసింది. ఎంతోమంది శిథిలా కింద చనిపోయారు. అలాంటి రోజే ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశ నేత ప్రపంచంలోనే అత్యంత కిరాతక నేరస్థుడితో మాస్కోలో ఆలింగనం చేసుకున్నారు. ఇది తీవ్ర నిరాశను కలిగించింది. శాంతి ప్రయత్నాలకు ఇది గట్టి ఎదురుదెబ్బ లాంటిదే’ అని ఎక్స్ వేదికగా జెలెన్స్కీ పేర్కొన్నారు.