సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ ఇటీవల నిర్వహించిన తన ఈవెంట్ లో ఐఫోన్ 12 మోడల్స్‌ను రిలీజ్ చేస్తుందని అనుకున్నారు. కానీ ఆ ఫోన్లు తప్ప ఇతర ప్రొడక్ట్స్ అన్నింటినీ యాపిల్ లాంచ్ చేసింది. ఇక అతి త్వరలోనే ఐఫోన్ 12 ఫోన్లను కూడా యాపిల్ రిలీజ్ చేస్తుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ ఫోన్లకు చెందిన ధరలు ప్రస్తుతం ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. అనుకున్న దానికన్నా ఈ ఫోన్ల ధరలు కొంత ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
యాపిల్ తన ఐఫోన్ 12 ఫోన్లలో 5జి ఫీచర్‌ను అందిస్తుందని తెలుస్తోంది. అయితే 5జి ఫీచర్ కోసం ఆయా ఫోన్లలో అమర్చనున్న పరికరాల ధర 50 డాలర్ల వరకు పెరిగింది. అందుల్ల ఆయా ఫోన్ల ధరలు కూడా ఎక్కువగానే ఉంటాయని తెలుస్తోంది. ఈ క్రమంలోనే 5.4 ఇంచుల ఐఫోన్ 12 ధర దాదాపుగా 649 డాలర్లు (దాదాపుగా రూ.47,772) ఉండే అవకాశం ఉన్నట్లు తెలిసింది. అలాగే 6.1 ఇంచుల ఐఫోన్ 12 మోడల్ ధర 749 డాలర్లు (దాదాపుగా రూ.55,134) ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇక ఐఫోన్ 12 ప్రొ లో ఒక మోడల్ ధర 999 డాలర్లు (దాదాపుగా రూ.73,536), మరో మోడల్ ధర 1099 డాలర్లు (దాదాపుగా రూ.80,897) ఉంటుందని తెలుస్తోంది. ఇక వీటిని భారత్‌లో విక్రయిస్తే అదనంగా మరో 18 శాతం పన్ను విధిస్తారు. కనుక ఆ మొత్తం ఇక్కడ పెరుగుతుంది. అయితే ఇవే ధరలతో యాపిల్ ఆయా ఫోన్లను విక్రయిస్తుందా, లేదా అన్న వివరాల్లో ఇంకా స్పష్టత రాలేదు. దానిపై త్వరలో తెలుస్తుంది.
కాగా ఐఫోన్ 12 ఫోన్లు మొత్తం 4 వేరియెంట్లలో విడుదల కానున్నట్లు తెలిసింది. ఒక వేరియెంట్‌లో 5.4 ఇంచుల డిస్‌ప్లే, మరో 3 వేరియెంట్లలో 6.1 ఇంచుల డిస్‌ప్లేలను యాపిల్ అందిస్తున్నట్లు సమాచారం. ఇక ఈ ఫోన్లన్నింటిలోనూ 5జి ఫీచర్ ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ల డిజైన్ 2010లో విడుదలైన ఐఫోన్ 4 ఫోన్‌ను పోలి ఉంటుందని తెలుస్తోంది.