బాబుకు కోటి రూపాయ‌లిస్తా.. జ‌గ‌న్ హామీ…!

-

హామీలు.. రాజ‌కీయాల్లో ఉన్న నాయ‌కుల‌కు, పార్టీల‌కు ఇవి కొత్త‌కాదు. మ‌రీ ముఖ్యంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు ఇచ్చే హామీల‌కు ఇటీవ‌ల కాలంలో ఏ పార్టీకి కూడా అంతూ ద‌రీ లేకుండా పోతోంది. మేం అది చేస్తాం.. ఇది చేస్తాం.. గోరు ముద్ద‌లు కూడా తినిపిస్తాం.. అంటూ నాయ‌కులు గుప్పించిన హామీలు అన్నీ ఇన్నీకావు. అయితే, అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత వాటిని తీర్చేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. గ‌తంలో టీడీపీ అధినేత 2014లో ఏపీలో అధికారంలోకి వ‌చ్చేందుకు రైతుల‌కు రుణ‌మాఫీ చేస్తాన‌ని హామీ ఇచ్చారు. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత అది భార‌మ‌ని తెలిసి.. నానా లూపులైన్లు వెతికారు.

దీంతో చంద్ర‌బాబు స‌ద‌రు హామీపై తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కొన్నారు. అయితే, దీనికి భిన్నంగా ఏపీ సీఎం జ‌గ‌న్‌.. మాత్రం గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో తాను ఎలాంటి హామీలు ఇచ్చారో.. వాటిని తూ.చ‌. త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తున్నారు. రాష్ట్రంపై ఆర్థికంగా పెను భారం ప‌డిన‌ప్ప‌టికీ.. ఆయ‌న హామీల విష‌యంలో మ‌డ‌మ తిప్ప‌డం లేదు. ఇది ఆయ‌న‌కు మంచి పేరు తెస్తోంది. క్షేత్ర‌స్థాయిలో మ‌హిళ‌లు కూడా పొంగిపోతున్నారు. మా జ‌గ‌న‌న్న‌.. అంటూ.. మురిసిపోతున్నారు. అయితే, జ‌గ‌న్‌ కేవ‌లం.. పేద‌ల‌కు, ప్ర‌జ‌ల‌కు మాత్ర‌మే హామీలు ఇవ్వ‌లేదు.. ఆయ‌న అధికారంలోకి వ‌చ్చిన తొలినాళ్ల‌లో 175 మంది త‌న‌తోస‌హా ఎమ్మెల్యేల‌కు కూడా ఒక హామీ ఇచ్చారు.

అదే ఇప్పుడు ప్రాణ‌సంక‌టంగా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తొలి అసెంబ్లీలో ప్ర‌సంగించిన సీఎం జ‌గ‌న్‌.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభివృద్ధి నిధులు ఇస్తామ‌ని చెప్పారు. ఇది సాధార‌ణంగా ఎవ‌రున్నా చేసే ప‌నే. అయితే, దీనికి భిన్నంగా జ‌గ‌న్ ఓ హామీ విసిరారు. ప్ర‌తి ఎమ్మెల్యేకీ.. ఏటా కోటి రూపాయ‌ల‌ను అందిస్తామ‌ని, ఆ నిధుల‌తో వారి వారి నియోజ‌క‌వ‌ర్గాల‌ను అభివృద్ధి చేసుకోవ‌చ్చ‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబును ఉద్దేశించి కూడా జ‌గ‌న్ ఈ హామీని వ‌ర్తింప‌చేస్తామ‌న్నారు. బాబు కు కూడా కోటి రూపాయ‌లు ఇస్తాం. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోనూ అభివృద్ధి చేసుకుని, ఆయ‌న పేరు పెట్టుకున్నా మేం ఏమీ అనం.. అని వ్యాఖ్యానించారు.

అయితే, ఇప్పుడు ఏడాదిన్న‌ర గ‌డిచిపోయినా.. జ‌గ‌న్ ఈ హామీపై దృష్టి పెట్ట‌డం లేదు. జ‌గ‌న్ ఇచ్చిన హామీ మేర‌కు 175 కోట్ల ను ఏటా ఎమ్మెల్యేల‌కు ఇవ్వాలి. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఇచ్చింది లేదు. పోనీ.. ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు ఇవ్వ‌క‌పోయినా.. సొంత పార్టీ ఎమ్మెల్యేల‌కైనా ఇవ్వాల‌ని వైసీపీ ఎమ్మెల్యేల నుంచి డిమాండ్ వ‌స్తోంది. అయినా కూడా జ‌గ‌న్ పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేద‌ట‌. దీనికి రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండ‌డ‌మే కార‌ణ‌మ‌ని అంటున్నారు. మ‌రి ఈ హామీ అమ‌లైతే.. చంద్ర‌బాబు కూడా షాక్‌కు గురికావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

-Vuyyuru Subhash

Read more RELATED
Recommended to you

Latest news