సాఫ్ట్‌వేర్ సంస్థ యాపిల్ ఇటీవలే తన ఐఫోన్ యూజర్లకు నూతనంగా ఐఓఎస్ 14 అప్‌డేట్‌ను విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ అప్ డేట్ వల్ల యూజర్లు తమ ఐఫోన్ల హోం స్క్రీన్లను విడ్జెట్ల సహాయంతో తమకు నచ్చిన విధంగా తీర్చిదిద్దుకునేందుకు వీలు కల్పించారు. అయితే ఈ ఫీచర్ నిజానికి ఆండ్రాయిడ్ ఫోన్లలో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ.. ఐఫోన్లలో మాత్రం ఇటీవలే ఐఓఎస్ 14 అప్‌డేట్ ద్వారా వచ్చింది. దీంతో ఐఫోన్ యూజర్లు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు తమ ఫోన్ల హోం స్క్రీన్లను తమకు నచ్చిన విడ్జెట్లతో తమకు నచ్చిన విధంగా మార్చుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చినందున వారు హ్యాపీగా ఫీలవుతున్నారు.
అయితే ఐఓఎస్ 14 వచ్చిన నేపథ్యంలో ఐఫోన్ యూజర్లకు 3 యాప్స్ యాప్ స్టోర్‌లో కొత్తగా లభ్యమవుతున్నాయి. కలర్ విడ్జెట్స్, ఫొటో విడ్జెట్, విడ్జెట్ స్మిత్ పేరిట ఆ యాప్స్ లభిస్తున్నాయి. వీటిని నిజానికి ఐఓఎస్ 14తోనే రిలీజ్ చేశారు. కానీ వారం వ్యవధిలోనే వీటిని కొన్ని లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ 3 యాప్స్ ప్రస్తుతం ఐఫోన్ యూజర్లలో విపరీతమైన క్రేజ్‌ను పెంచుతున్నాయి. కారణం ఐఓఎస్ 14లో ఉన్న విడ్జెట్ ఫీచర్‌ను ఈ యాప్‌ల సహాయంతో మరింత సౌకర్యవంతంగా ఉపయోగించుకోవచ్చు.
విడ్జెట్ స్మిత్ యాప్ సహాయంలో ఐఫోన్ల హోం స్క్రీన్లను విడ్జెట్‌లతో అలంకరించుకోవచ్చు. అందుకు గాను డేట్, వెదర్, ఆస్ట్రానమీ తదితర విడ్జెట్స్‌ను అందిస్తున్నారు. వీటిని హోం స్క్రీన్‌లో యూజర్లు తమకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు. అలాగే అవి తెరపై కనిపిస్తాయి. ఈ యాప్ ఉచితంగానే యాప్ స్టోర్‌లో అందుబాటులో ఉంది. అయితే డబ్బులు చెల్లిస్తే ప్రీమియం ఫీచర్లను పొందవచ్చు.
ఇక కలర్ విడ్జెట్ యాప్ కూడా సరిగ్గా ఇలాగే పనిచేస్తుంది. ఐఫోన్ యూజర్లు తమకు నచ్చిన డిజైన్లతో విడ్జెట్లను క్రియేట్ చేసుకోవచ్చు. దీనికి గాను యూజర్లకు పలు ఆప్షన్లను అందిస్తున్నారు. దీంతో హోం స్క్రీన్లు డిఫరెంట్ లుక్‌లో కనిపించేలా సెట్ చేసుకోవచ్చు.
ఫొటో విడ్జెట్ యాప్ సహాయంతో యూజర్లు తమ ఐఫోన్ ఫొటో లైబ్రరీలోని ఏవైనా 6 ఫొటోలను ఎంచుకుని వాటితో విడ్జెట్లను క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే వాటిపై ట్యాప్ చేయడం ద్వారా వాటిని ఫుల్ స్క్రీన్ మోడ్‌లో చూడవచ్చు. ఇక ఈ యాప్స్ అన్నీ యాపిల్ యాప్ స్టోర్‌లో ఐఫోన్ యూజర్లకు ఉచితంగానే లభిస్తున్నాయి. అయితే డబ్బులు చెల్లిస్తే ప్రీమియం ఖాతా కింద మరిన్ని ఫీచర్లను పొందవచ్చు.