ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పొలానికి సాగు నీటిని తీసుకెళ్లాలనే లక్ష్యంతో సమగ్ర నూతన జలవిధానాన్ని రూపొందిస్తామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. పోలవలం ప్రాజెక్టును పూర్తి చేయడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమన్నారు. చింతలపూడి, వంశధార రెండో దశ, వెలిగొండ, హంద్రీనీవా సుజల స్రవంతి, టీబీపీ-హెచ్ఎసీ ప్రాజెక్టులను పూర్తిచేస్తామని చెప్పారు.
గోదావరి- పెన్నా, నాగావళి -వంశధార నదులను అనుసంధానం చేస్తామని వెల్లడించారు. ఈ క్రమంలోనే బడ్జెట్‌లో జలవనరుల కోసం రూ.16,705 కోట్లను ఏపీ ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయంతో ఏపీలోని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని ప్రకటించారు.