కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ 2020 ప్రతుల ముద్రణకు ముందు నిర్వహించే హల్వా వేడుకను సోమవారం నార్త్ బ్లాక్‌లోని ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు అధికారులు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఆర్ధిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ హల్వా రుచి చూసారు. ఆమెతోపాటు ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా హల్వా రుచి చూసారు. అసలు ఈ హల్వా వేడుక అంటే ఏంటీ…?
ప్రతీ ఏటా బడ్జెట్‌కు ముందు మన సంప్రదాయం ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో ‘హల్వా వేడుక ’ ఘనంగా నిర్వహిస్తారు. కేంద్ర బడ్జెట్ సంబంధించిన అంశాలను ఆర్ధిక శాఖ అధికారులు అత్యంత రహస్యంగా ఉంచుతారు. ఈ బడ్జెట్ కసరత్తు మొదలుకాగానే నార్త్‌బ్లాక్‌లోని ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్దకు విలేకర్లను కూడా అనుమతించే అవకాశం ఉండదు. ఆర్థికశాఖకు చెందిన కొందరు కీలక సిబ్బంది మాత్రమే ఈ వ్యవహారంలో ఉంటారు.
బడ్జెట్ సమర్పించే పదిరోజుల ముందుగా ప్రతుల ముద్రణను అధికారులు ప్రారంభిస్తారు. ఇక ఇది అంతా పక్కాగా జరిగే వ్యవహారం. చీమ కూడా బయటకు వెళ్ళే అవకాశం ఉండదు. ఈ వ్యవహారంలో పాల్గొనే సిబ్బంది దాదాపు 10 రోజుల పాటు అక్కడే ఉండాలి. ఈ ముద్రణ మొదలు కావడానికి ముందు భారతీయ వంటకమైన హల్వాను తయారు చేస్తారు. ఆర్థిక మంత్రి సమక్షంలో దీనిని సిబ్బందికి వడ్డిస్తారు.
ఇక బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ఆర్ధిక మంత్రి ప్రవేశపెట్టే వరకు కూడా సంబంధిత సిబ్బందికి ఇక్కడే వసతి సౌకర్యాలు కల్పిస్తారు అధికారులు. కనీసం బంధువులకు కూడా ఫోన్ చేసుకొనే అవకాశం ఈ సిబ్బందికి ఉండదు. అత్యవసరమైతే మాత్రం అక్కడి భద్రతా సిబ్బంది సమక్షంలో సిబ్బంది ఫోన్ చేసుకోవచ్చు. ఎంత సేపు పడితే అంతసేపు మాట్లాడటానికి ఉండదు.