పాత రూ.100 నోట్లను త్వరలో చెలామణీ చేయబోవడం లేదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఇటీవలే ఒక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. పాత రూ.100 నోట్లను ఇకపై చెలామణీ చేయబోమని ఆర్‌బీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. అయితే దీన్ని ఆసరగా చేసుకుని కొందరు ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేయడం మొదలు పెట్టారు. రూ.100, రూ.10, రూ.5 నోట్లను ఆర్‌బీఐ ఉపసంహరిస్తుందని, త్వరలో ఆ నోట్లను మార్చుకోవాల్సి వస్తుందని కొందరు ప్రచారం మొదలు పెట్టారు.
ఆర్‌బీఐ త్వరలో రూ.100, రూ.10, రూ.5 నోట్లను ఉపసంహరించుకుంటుందని, దీంతో ఆయా నోట్లు చెల్లవని ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది. అయితే దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) స్పష్టతనిచ్చింది. ఆర్‌బీఐ చేసిన ప్రకటనను కొందరు మార్చి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని తెలిపింది.
పాత రూ.100 నోట్లను త్వరలో చెలామణీ చేయడం ఆపేస్తామని, అంతేకానీ అవి చెల్లుతాయని ఆర్‌బీఐ తెలిపింది. అయితే దీన్ని కొందరు పూర్తిగా మార్చేశారు. రూ.100 నోట్లతోపాటు రూ.10, రూ.5 నోట్లను కూడా ఆర్‌బీఐ మార్చి నుంచి విత్‌డ్రా చేసుకుంటుందని, దీంతో ఆయా నోట్లు పనికిరాకుండా పోతాయని కొందరు తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. కనుక ఆ వార్తలను నమ్మకూడదని పీఐబీ కోరింది.