ఏ బ్యాంకులోనైనా సరే.. సాధారణ సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతా ఓపెన్ చేయాలన్నా, దాన్ని నిర్వహించాలన్నా.. అందులో మినిమం బ్యాలెన్స్ ఉంచాలి. కానీ పోస్టాఫీస్ బ్యాంక్ ఖాతా అలా కాదు. చాలా తక్కువ మినిమం బ్యాలెన్స్ ఉంచినా చాలు.
ప్రస్తుతం మనం ఏదైనా బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయాలంటే నిమిషాల్లో ఆ ప్రక్రియ జరుగుతుంది. అకౌంట్ ఓపెన్ కాగానే దాన్నుంచి మనం లావాదేవీలను కూడా నిర్వహించవచ్చు. అలాగే దాంతోపాటు మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు కూడా వెంటనే లభిస్తాయి. ఇక ఏటీఎం, చెక్‌బుక్ కిట్లను కూడా అకౌంట్ ఓపెన్ చేయగానే అందిస్తారు. అయితే ఏ బ్యాంకులోనైనా సరే.. సాధారణ సేవింగ్స్ లేదా కరెంట్ ఖాతా ఓపెన్ చేయాలన్నా, దాన్ని నిర్వహించాలన్నా.. అందులో మినిమం బ్యాలెన్స్ ఉంచాలి. కానీ పోస్టాఫీస్ బ్యాంక్ ఖాతా అలా కాదు. చాలా తక్కువ మినిమం బ్యాలెన్స్ ఉంచినా చాలు. అలాగే మరెన్నో ప్రయోజనాలు మనకు పోస్టాఫీస్ బ్యాంక్ ఖాతా ద్వారా లభిస్తాయి.
నూతనంగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలని అనుకునే వారు తొందర పడకండి. బ్యాంకులకు బదులుగా పోస్టాఫీస్‌లలో సేవింగ్స్ ఖాతా ప్రారంభించండి. చాలా తక్కువ ధరతో అకౌంట్‌ను ఓపెన్ చేయవచ్చు. అలాగే దానికి ఏటీఎం సదుపాయం కూడా లభిస్తుంది. ఇక మినిమం బ్యాలెన్స్ గురించి ఆందోళన పడాల్సిన పని ఉందు. పోస్టాఫీస్‌లో సేవింగ్స్ ఖాతా తెరవాలంటే రూ.20 ఉంటే చాలు. అదే ఎస్‌బీఐలో అయితే కనీసం ఎంత లేదన్నా రూ.1000 ఉండాలి. ఇక ఈ అకౌంట్‌తో ఏడాదికి 4 శాతం వడ్డీ పొందవచ్చు. అదే ఎస్‌బీఐలో అయితే ఈ వడ్డీ కేవలం 3.5 శాతం మాత్రమే ఉంటుంది.
ఇక బ్యాంక్ ఖాతాలో కేవలం రూ.50 మినిమం బ్యాలెన్స్ ఉంటే సరిపోతుంది. నాన్ చెక్ ఫెసిలిటీ ఉన్న అకౌంట్లకు ఇది వర్తిస్తుంది. అదే చెక్‌బుక్ కావాలని భావిస్తే రూ.500తో అకౌంట్ ఓపెన్ చేయాలి. అందులో మినిమం బ్యాలెన్స్ రూ.500 ఉంచాలి. ఇక సీబీఎస్ పోస్టాఫీసుల్లో ఎలక్ట్రానిక్ రూపంలోనే డబ్బులను డిపాజిట్ చేయవచ్చు. కస్టమర్లకు ఏటీఎం డిపాజిట్, విత్‌డ్రా సౌలభ్యాన్ని కూడా అందిస్తున్నారు. కాగా పోస్టాఫీసుల్లో అకౌంట్‌ను సింగిల్‌గా లేదా జాయింట్‌గా ఓపెన్ చేయవచ్చు. 10 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ పోస్టాఫీసుల్లో సేవింగ్స్ అకౌంట్లను ఓపెన్ చేయవచ్చు. అయితే తల్లిదండ్రులు 10 ఏళ్ల లోపు ఉన్న తమ పిల్లలకు కూడా అకౌంట్లను తీసుకోవచ్చు.
పోస్టాఫీసుల్లో ఒకరి పేరు మీద ఒక అకౌంట్‌ను మాత్రమే తెరిచేందుకు అవకాశం ఉంటుంది. దాన్ని అవసరం అనుకుంటే ఇతర పోస్టాఫీస్ బ్రాంచ్‌లకు కూడా మార్చుకోవచ్చు. ఇక ఒక ఆర్థిక సంవత్సరంలో సేవింగ్స్ అకౌంట్‌పై వడ్డీ ఆర్జిస్తే దానిపై ఎలాంటి పన్ను ఉండదు. రూ.10వేల వరకు అందుకు మినహాయింపు లభిస్తుంది. ఇక అకౌంట్ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండాలంటే.. కనీసం 3 సంవత్సరాలకు ఒక లావాదేవీ అయినా నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టాఫీసుల్లో సేవింగ్స్ అకౌంట్లను ఓపెన్ చేయడం వల్ల మనకు ఇన్ని లాభాలు కలుగుతాయన్నమాట..!