ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి…ఈ మధ్య కాలంలో భారీ సభలు పెడుతూ ప్రజల్లో ఉంటున్న విషయం తెలిసిందే. అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, లేదా సంక్షేమ పథకాలకు బటన్ నొక్కడం లాంటి కార్యక్రమాలని..భారీ సభలు పెట్టి చేస్తున్నారు. అయితే అన్నీ సభల్లో జగన్ కొన్ని విమర్శలని రిపీట్ చేస్తున్నారు. దుష్టచతుష్టయం ..ఈ పేరుని ఎక్కువ సార్లు చెబుతున్నారు. చంద్రబాబు, ఈనాడు, టీవీ5, ఆంధ్రజ్యోతి..తమ ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నా సరే..కావాలని బురదజల్లే కార్యక్రమాలు దుష్టచతుష్టయం చేస్తుందని అంటున్నారు. దుష్టచతుష్టయంకు తోడుగా దత్తపుత్రుడు అంటే..బాబుకు పవన్ కల్యాణ్ దత్తపుత్రుడు అని, బాబు చెప్పిందే పవన్ చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
తాజాగా నర్సీపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు చేసిన జగన్..మళ్ళీ దుష్టచతుష్టయం అని విమర్శలు చేశారు. దుష్టచతుష్టయం కుట్రలను ప్రజలు గమనించాలని, మూడున్నరేళ్లలోనే ఉత్తరాంధ్రకు మెడికల్ కాలేజీలు తెచ్చామన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నిలబెట్టుకుంటామని, చెడిపోయిన రాజకీయ వ్యవస్థతో మనం యుద్ధం చేస్తున్నామని జగన్ అన్నారు.
ఇక చెడిపోయిన రాజకీయ వ్యవస్థ అని పదే పదే అంటున్నారు. అదే సమయంలో తాజాగా కందుకూరు చంద్రబాబు రోడ్ షోలో 8 మంది టీడీపీ కార్యకర్తలు చనిపోవడంపై వైసీపీ నేతలు అందరూ..కేవలం బాబు పబ్లిసిటీ పిచ్చి వల్లే చనిపోయారని, ఇరుకు రోడ్డులో సభ పెట్టడం వల్లే ప్రాణాలు కోల్పోయారని చంద్రబాబుపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జగన్ కూడా అదే విమర్శ చేశారు.
ఇక పవన్‌కు దర్శకుడు, నిర్మాత అన్నీ చంద్రబాబు అని విమర్శించారు. అయితే జగన్..టీడీపీ అనుకూల మీడియాని దుష్టచతుష్టయం అని టార్గెట్ చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీ అనుకూల మీడియాపై టీడీపీ విమర్శలు చేస్తుంది. ఇలా జగన్ చెప్పిందే చెప్పడానికి కారణం ఉన్నట్లు ఉంది..అలా పదే పదే చెప్పడం వల్ల టీడీపీ గాని, దాని అనుకూల మీడియా గాని చెప్పేవి అబద్దాలు అని ప్రజలు భావించాలనే కాన్సెప్ట్‌లో జగన్ విమర్శిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి జగన్ చెప్పినవి ప్రజలు ఎంతవరకు నమ్ముతారనేది చూడాలి.