ఏపీ సీఎం జగన్ పట్టుబడితే.. ఏ పనిలో అయినా ఆయన ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. అది ఎలాంటిదైనా .. ఆయన ముందుకే వెళ్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఇలాంటి నిర్ణయాలు కేవలం రాష్ట్రం వరకే పరిమితమయ్యాయి. కానీ, ఇప్పుడు పొరుగు రాష్ట్రం అభ్యంతరం పెడుతున్నా కూడా జగన్ పట్టుదలతోనే పోతిరెడ్డిపాడు విషయంలో ఆయన ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం రాయలసీమ జిల్లాలు నీటి ఎద్దడితో అల్లాడుతున్నాయి. కృష్ణానది నీటిని ఈ జిల్లాలకు తరలించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఈ క్రమంలోనే పోతిరెడ్డిపాడు నిర్మాణం కూడా జరిగింది.
అయితే, శ్రీశైలంలో వరద జలాలు ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా సీమకు నీళ్లిచ్చే పరిస్థితి ఉంది. అయితే, వరద జలాలను తెలంగాణ ఎప్పటికప్పుడు మళ్లించేస్తోంది. దీంతో ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఇక్కడ వరద జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా పంపుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన జగన్.. ఇకపై నిరంతరాయంగా శ్రీశైలం ద్వారా ఏపీకి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కేటాయించిన వరద జలాలను పోతిరెడ్డిపాడు ద్వారా ఎత్తిపోసుకునేందుకు వీలుగా పోతిరెడ్డిపాడును ఎత్తు పెంచడం తో పాటు..ఈ కాల్వలను విస్తరించాలని కూడా జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ క్రమంలోనే జీవో 203ను విడుదల చేసి, నాలుగు వేల కోట్ల పనులకు టెండర్లను కూడా పిలిచింది. ఈ క్రమంలోనే తెలంగాణ నుంచి వ్యతిరేకత ప్రారంభమైంది. కేసీఆర్ సహా బీజేపీ కూడా జగన్ ప్రతిపాదనను అడ్డుకునేందుకు శత విధాల ప్రయత్నిస్తున్నారు. కానీ, జగన్ మాత్రం ఈ విషయంలో ముందుకు వెళ్లాలనే నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి కృష్ణానదీ యాజమాన్యం కేటాయించిన కేటాయింపుల విషయాన్ని తెరమీదికి తెచ్చి.. మా హక్కులను మేం వినియోగించుకుంటున్నామనే వాదనను తెరమీదికి తెచ్చారు.
ఈ క్రమంలోనే బోర్డు చైర్మన్‌తో హైదరాబాద్‌లో ఏపీ అధికారులు భేటీ కానున్నారు. ఈ పరిణామం కనుక సక్సెస్ అయి.. బోర్డు కనుక ఏపీ వాదనలతో సంతృప్తి చెందితే.. ఇక, జగన్ వ్యూహానికి తిరుగులేదని అంటున్నారు. అయితే, దీనిని అడ్డుకునేందుకు కేసీఆర్ సహా తెలంగాణ బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.