అమ్మకు వందనం పథకంపై వైసీపీ, నీలి మీడియా అబద్దపు ప్రచారాలు చేస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు.దీనిపై ప్రెస్ కౌన్సిల్ కు ఫిర్యాదు చేయనున్నట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఇచ్చిన మాటపై నిలబడని వ్యక్తి జగన్ రెడ్డి అని, ఇచ్చిన మాటపై నిలబడే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని నిమ్మల అన్నారు. ఆ పథకంపై ఇంకా విధివిధానాలు రూపొందించక ముందే “అమ్మకు వందనం మంగళం” అంటూ తమ పత్రికల్లో విష ప్రచారాలు చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పకుండా నిలబెట్టుకుంటుందని, ప్రతి బిడ్డకూ దీన్ని అమలు చేసి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు.ఎన్నికల హామీ మేరకు పెంచిన వెయ్యి రూపాయల పింఛన్‌ను 5 రోజుల్లోనే ఇంటికి తెచ్చి ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి వెయ్యి రూపాయలు పెంచేందుకు 5 సంవత్సరాలు పట్టిందని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో అమ్మఒడి పేరుతో అమ్మలను మోసం చేశారని, వారికి ఇవ్వాల్సిన నగదులో కోతలు పెట్టారని విమర్శించారు.