ఏపీలో విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర జన్మదినానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. దీనితో ఏపీ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఆలయ మర్యాదలు చేయాలని గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకుంటూ దేవాదాయ శాఖ ప్రకటన చేసింది. ఈ రోజు హైకోర్ట్ లో జరిగిన విచారణ సందర్భంగా ఆలయ మర్యాదల కోసం తాము రాసిన లేఖను ఉపసంహరించుకుంటామని శారదా పీఠం తరపు న్యాయవాది తెలిపారు.
హైకోర్ట్ లో లేఖను ఉపసంహరించుకుంటామని తెలపటంతో గతంలో ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకున్నామని దేవాదాయ శాఖ ప్రకటన చేసింది. ఈ మేరకు మంగళవారం దేవాదాయ శాఖ స్పెషల్ కమిషనర్ అర్జునరావు ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రంలోని 23 దేవాలయాలకు దేవాదాయ శాఖ స్పెషల్ కమిషనర్ ఉత్తర్వులు పంపారు. ఈ వ్యవహారంపై విపక్ష తెలుగుదేశం తీవ్ర విమర్శలు చేసింది.