చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నాడో కవి. పుస్తకాలను చదవడం ద్వారా ఎంత జ్ఞానం వస్తుందో తెలియజేయడానికి ఆ కవి అలా అన్నాడు. అయితే ఆ యువకుడు అలా చేయలేదు కానీ సరిగ్గా అదే సూత్రాన్ని ఐఫోన్‌కు వర్తింపజేశాడు. అవయవం అమ్మి అయినా సరే ఐఫోన్ వాడు అనే సూత్రాన్ని పాటించాడు. కిడ్నీ అమ్ముకుని ఐఫోన్ కొన్నాడు. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.
చైనాలోని హునాన్ ప్రావిన్స్‌కు చెందిన వాంగ్ షంగ్‌కున్ కు 2011లో 17 ఏళ్లు. అప్పట్లో ఐఫోన్ 4 కొత్తగా విడుదలైంది. అయితే దాన్ని ఎలాగైనా కొనాలని, తన స్నేహితులకు చూపించాలని అనుకున్నాడు. వెంటనే ఆన్‌లైన్‌లో అవయవాలను కొనే ముఠాతో కాంటాక్ట్ అయ్యాడు. 20వేల యువాన్లకు డీల్ కుదర్చుకుని ఒక కిడ్నీని అమ్మాడు. అయితే కిడ్నీ అమ్మి ఐఫోన్‌ను కొన్నాడు కానీ అతని పరిస్థితి ఇప్పుడు దుర్భరంగా మారింది.
ఉన్న ఒక్క కిడ్నీ ద్వారా అతని శరీరంలో ఉన్న వ్యర్థాలు బయటకు వెళ్లలేదు. ఒక్క కిడ్నీపైనే భారం అంతా పడింది. దీంతో కిడ్నీ ఫెయిల్ అయింది. తరువాత ఇన్‌ఫెక్షన్లు వచ్చాయి. అలా అతను డయాలసిస్ మీదే ఆధార పడి జీవించడం మొదలు పెట్టాడు. కానీ అతని పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైంది. రేపో, మాపో అన్నట్లు జీవిస్తున్నాడు. దీంతో అతను పడుతున్న బాధ వర్ణనాతీతం. ఏది ఏమైనా ఐఫోన్ మోజులో పడి అతను కిడ్నీని అమ్ముకోవడం నిజంగా విచారకరం. ఇప్పుడు చూడండి, ఎంతటి బాధను అనుభవిస్తున్నాడో..!