గడిచిన నాలుగు రోజులుగా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల విషయం.. తీవ్రస్థాయిలో చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. నిన్న మొన్నటి వరకు దోస్తానా కట్టిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇకపై విడిపోనున్నారని, వారి మధ్య నీళ్లు నిప్పులు రాజేశాయని కథనాలు, విశ్లేషణలు వచ్చాయి. ఇక, కొన్ని మీడియాల్లో అయితే, కేసీఆర్ గురించి జగన్‌కు తెలియదు కాబట్టి.. అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చాడని, ఇప్పుడు పోతిరెడ్డి పాడు విషయంలో కేసీఆర్ తన విశ్వరూపం చూపిస్తున్నారని.. ఇది జగన్‌కు గట్టి షాకేనని విమర్శలు కూడా వచ్చాయి.
ఏపీ ప్రభుత్వం కృష్ణా జలాలకు సంబంధించి పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్ధ్యాన్ని పెంచడం, దీని కింద ఉన్న కాలువలను వెడల్పు చేయడం వంటివాటి కోసం జీవో 203ను విడుదల చేసింది. ఇది తెలంగాణలో తీవ్ర దుమారం రేపింది. అయితే, ఈ విషయంలో ముందుగా స్పందించింది ప్రతిపక్ష నాయకులే. తర్వాత తీరిగ్గా స్పందించిన కేసీఆర్.. దీనిపై కేంద్రానికి లేఖ రాశారు. అనంతరం, దీనికి రాజకీయ రంగు పులుముకుంది. ఈ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య దుమారం రేగుతుందని, దీనిని రాజకీయం గా మార్చుకుని అంతో ఇంతో లబ్ధి పొందుదామని కొందరు భావించారు.
అయితే, అనూహ్యంగా సీఎం కేసీఆర్(వాస్తవానికి ఇప్పట్లో దీనిపై స్పందించరని అందరూ అనుకున్నారు) ఈ విషయంపై స్పందించారు. మా వాటా నీళ్లను మేమే వాడుకుంటున్నాం.. అని చెబుతూనే.. జగన్‌తో తనకు ఎలాంటి విభేదాలూ లేవని వెల్లడించారు. అదేసమయంలో భవిష్యత్తులోనూ తాను విభేదించే అవకాశం లేదని చెప్పారు. అయితే, పోతిరెడ్డిపాడు విషయంలో హక్కుల మేరకు అన్నీ జరుగుతాయని తెలిపారు. ఇక, గోదావరి జలాలను ఏపీకి ఇస్తామని చెప్పారు. ఇలా మొత్తంగా అసలు జరుగుతున్న పరిణామాలను పూర్తిగా యూటర్న్ తిప్పేలా కేసీఆర్ వ్యవహరించి.. ప్రస్తుతానికి ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టారని అంటున్నారు పరిశీలకులు. మరి మున్ముందు ఏం జరుగుతుందో చూడాలి.