మైనింగ్ రంగంపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం లోని డిఎంజి కార్యాలయంలో లీజుదారులతో రాష్ట్ర గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మైనింగ్ రంగంలో సీఎం వైయస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారన్నారు. ఎక్కువ మందికి మైనింగ్ లో అవకాశం కల్పించేందుకే ‘ఈ-ఆక్షన్’ విధానం తీసుకోస్తున్నట్లు వెల్లడించారు.
పారదర్శకతతో వేగంగా లీజుల జారీకి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఔత్సాహికులకు ప్రోత్సాహకరంగా కొత్త విధానం అని.. ఎక్కువ క్వారీలను ఆపరేటింగ్ లోకి తీసుకురావాలన్నదే లక్ష్యమన్నారు. మైనింగ్ ఆధారిత పరిశ్రమలు పెరిగి, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని.. ఈ విధానం పై లీజుదారుల సహకారం కోరుతున్నామని చెప్పారు. లీజుదారుల అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నామని.. ఎక్కడైనా సమస్యలు ఉంటే సీఎం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తామని ప్రకటించారు.