మాజీ సీఎం జగన్ చేసిన పాపాలు ప్రజలను వెంటాడుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మంత్రి రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ మీద రూ.14 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఈ విషయాన్ని కూటమి నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
గత ఐదేళ్లలో జగన్ చేసిన పాపాలే ప్రజలపై భారం రూపంలో వెంటాడుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం విద్యుత్ కొనుగోళ్ల రేట్లను దాచి చీకటి జీవోలు ఇచ్చి ప్రజలపై భారం మోపిందన్నారు. కేవలం ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యిందని, సీఎం చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే పనిలో ఉన్నారని వివరించారు. రాజమండ్రి శుభమస్తు కల్యాణ మండపంలో కూటమి నాయకులతో భేటీ అయిన మంత్రి.. రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, సాగునీటి సంఘాలతో పాటు కో-ఆపరేటివ్ సొసైటీ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు.