జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరి జల్లా చట్టియార్ అనే ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల అష్ఫక్ మహమూద్ అనే యువకుడు షేరిట్‌కు పోటీగా కొత్త డోడో డ్రాప్ (Dodo Drop) అనే ఓ యాప్‌ను తాజాగా డెవలప్ చేశాడు. ఈ యాప్ సహాయంతో యూజర్లు ఆడియో, వీడియోలు, ఫొటోలు, టెక్ట్స్ ఫైల్స్‌ను రెండు డివైస్‌ల మధ్య ఇంటర్నెట్ అవసరం లేకుండానే ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.
ఈ సందర్భంగా అష్ఫక్ మహమూద్ మీడియాతో మాట్లాడుతూ.. డోడో డ్రాప్ యాప్ చైనీస్ యాప్ షేరిట్‌కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుందని తెలిపాడు. భారత ప్రభుత్వం చైనాకు చెందిన యాప్‌లను బ్యాన్ చేసిందని, దీంతో ఫైల్స్ షేర్ చేసుకునేందుకు షేరిట్ యూజర్లు ఇబ్బందులు పడుతున్నారని, అందుకనే వారి కోసం ఈ యాప్‌ను తాను డెవలప్ చేశానని తెలిపాడు. డోడో డ్రాప్ సహాయంతో యూజర్లు ఒకరికొకరు ఆడియో, వీడియో ఫైల్స్, ఫొటోలు, ఇతర డాక్యుమెంట్లను సులభంగా పంపుకోవచ్చని తెలిపాడు.
కాగా ఈ యాప్‌ను డెవలప్ చేసేందుకు తనకు 4 వారాల సమయం పట్టిందన్నాడు. ఆగస్టు 1న దీన్ని లాంచ్ చేశానని తెలిపాడు. ఇందులో షేరిట్ కన్నా ఎక్కువ వేగంతో ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకునే వీలుందన్నాడు. అలాగే ఈ యాప్‌ను ఎవరైనా చాలా సులభంగా వాడవచ్చని తెలిపాడు. ప్రధాని మోదీ ఆత్మనిర్భర భారత్‌లో భాగంగా తాను ఈ యాప్‌ను డెవలప్ చేశానని, ఇకపై కూడా ఇలాగే భారత యూజర్లకు అవసరమయ్యే యాప్‌లను డెవలప్ చేస్తానని అంటున్నాడు. ఇక డోడో డ్రాప్ యాప్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ ప్లే స్టోర్‌లో లభిస్తోంది. షేరిట్ వాడలేని వారు ఈ యాప్‌ను తమ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకుని దీంతో ఫైల్స్‌ను సులభంగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.